• 2031 నాటికి 11.43 బిలియన్ డాలర్లకు చేరనున్న భారత మార్కెట్.. హైదరాబాద్‌లోనూ భారీ అవకాశాలు.. రూ.13 వేల కోట్లకు పైగా పెట్టుబడుల నిబద్ధతలు!
  • బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలపై డెవలపర్ల ప్రత్యేక దృష్టి.. వృద్ధుల కోసం అత్యాధునిక నివాస సముదాయాలకు పెరుగుతున్న ఆదరణ!

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

భారత రియల్ ఎస్టేట్ రంగంలో కాలానుగుణంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, లగ్జరీ నివాసాల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు మరో కీలక విభాగం వైపు అడుగులు వేస్తున్నాయి. అదే ‘సీనియర్ లివింగ్’. వృద్ధాప్యంలోనూ గౌరవప్రదమైన జీవనం, మెరుగైన వైద్య సదుపాయాలు, నిరంతర భద్రత, ఆరోగ్య సంరక్షణతో పాటు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని కల్పించే ప్రత్యేక నివాస సముదాయాలకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మారుతున్న కుటుంబ వ్యవస్థ, పెరుగుతున్న వృద్ధుల జనాభా, పదవీ విరమణ అనంతరం నాణ్యమైన జీవనాన్ని కోరుకునే వారి సంఖ్య ఈ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి. ఫలితంగా సీనియర్ లివింగ్ భారత రియల్ ఎస్టేట్ రంగంలో భవిష్యత్తు అవకాశాలు అధికంగా ఉన్న ప్రత్యేక మార్కెట్‌గా రూపుదిద్దుకుంటోంది.

2031 నాటికి 11.43 బిలియన్ డాలర్ల మార్కెట్!

స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసిన ‘సీనియర్ లివింగ్ రిపోర్ట్ 2026’ ప్రకారం, భారతదేశంలో సీనియర్ లివింగ్ మార్కెట్ విలువ 2026లో 4.31 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, 2031 నాటికి 11.43 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గృహాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, సురక్షిత నివాస వాతావరణం, వెల్‌నెస్ ఆధారిత జీవనశైలికి పెరుగుతున్న ప్రాధాన్యత ఈ మార్కెట్ విస్తరణకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఈ విభాగంలో బెంగళూరు ఇప్పటికే ప్రముఖ మార్కెట్‌గా కొనసాగుతుండగా, హైదరాబాద్, పూణే, చెన్నై నగరాలు కూడా కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న వైద్య మౌలిక సదుపాయాలు, నివాస మార్కెట్ విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ ఈ రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

హైదరాబాద్.. సీనియర్ లివింగ్‌కు అనుకూల గమ్యస్థానం!

దేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా కొనసాగుతున్న హైదరాబాద్ ఇప్పుడు సీనియర్ లివింగ్ ప్రాజెక్టులకు కూడా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. నగరంలో కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య కేంద్రాలు, అత్యవసర వైద్య సేవలు విస్తృతంగా అందుబాటులో ఉండటం ఈ రంగానికి ప్రధాన బలంగా నిలుస్తోంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్, రవాణా సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలు కూడా ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి.కుటుంబ సభ్యులు ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర నగరాల్లో లేదా విదేశాల్లో స్థిరపడిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నివసించే వృద్ధులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నివాసాల అవసరం పెరుగుతోంది. ఈ పరిస్థితులను గుర్తించిన నిర్మాణ సంస్థలు వైద్య సేవలు, ఆరోగ్య పర్యవేక్షణ, అత్యవసర సహాయం, రోజువారీ నిర్వహణ వంటి సదుపాయాలతో కూడిన ప్రత్యేక నివాస ప్రాజెక్టులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీనియర్ లివింగ్ అంటే కేవలం ఇల్లు కాదు.. సంపూర్ణ జీవన భరోసా!

సాధారణ అపార్ట్‌మెంట్‌కు, సీనియర్ లివింగ్ నివాసానికి మధ్య ప్రధానమైన వ్యత్యాసం అందించే సేవలు, సదుపాయాల్లో ఉంటుంది. వృద్ధుల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భద్రత, సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను ప్రత్యేకంగా రూపొందిస్తారు.వీటిలో సాధారణంగా 24 గంటల భద్రత, అత్యవసర వైద్య సహాయం, ఆసుపత్రులతో అనుసంధానం, ఫిజియోథెరపీ, ఆరోగ్య పరీక్షలు, ప్రత్యేక ఆహార నిర్వహణ, హౌస్‌కీపింగ్, యోగా, వ్యాయామం, వినోద కార్యక్రమాలు వంటి సదుపాయాలు కల్పిస్తారు.అంతేకాకుండా వృద్ధులకు అనుకూలమైన నిర్మాణ రూపకల్పన, వీల్‌చైర్ సౌకర్యం, జారిపడే ప్రమాదాన్ని తగ్గించే నేలలు, సులభంగా ఉపయోగించుకునే బాత్‌రూమ్‌లు, అత్యవసర సమయంలో సహాయం అందించే వ్యవస్థలు కూడా కీలకంగా ఉంటాయి.ఈ తరహా నివాస సముదాయాలు వృద్ధులు తమ రోజువారీ పనులను సాధ్యమైనంతవరకు స్వయంగా నిర్వహించుకుంటూ, అవసరమైనప్పుడు వైద్య మరియు ఇతర సేవలను పొందేలా సహకరిస్తాయి. దీంతో వృద్ధాప్యంలో స్వతంత్రతతో పాటు ఆత్మవిశ్వాసం, సామాజిక అనుబంధం పెంపొందే అవకాశం ఉంటుంది.

డిమాండ్ 22 లక్షల యూనిట్లు.. సరఫరా కేవలం 25 వేలే!

భారత సీనియర్ లివింగ్ మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న అతిపెద్ద అవకాశం డిమాండ్, సరఫరా మధ్య ఉన్న భారీ అంతరం. కొలియర్స్ ఇండియా 2026 నివేదిక ప్రకారం, దేశంలో సీనియర్ లివింగ్ గృహాల ప్రస్తుత డిమాండ్ సుమారు 20 నుంచి 22 లక్షల యూనిట్లుగా ఉంది. అయితే వ్యవస్థీకృత రంగంలో అందుబాటులో ఉన్న గృహాల సంఖ్య కేవలం 25 వేల యూనిట్లకు పరిమితమైంది.2030 నాటికి ఈ డిమాండ్ 28 నుంచి 30 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని, అదే సమయంలో వ్యవస్థీకృత రంగంలోని గృహాల సరఫరా సుమారు లక్ష యూనిట్లకు పెరగవచ్చని కొలియర్స్ అంచనా వేస్తోంది. అంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సీనియర్ లివింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రూ13 వేల కోట్లకు పైగా పెట్టుబడులు.. రంగంపై పెరుగుతున్న విశ్వాసం!

సీనియర్ లివింగ్ రంగంలో ఉన్న దీర్ఘకాలిక అవకాశాలను గుర్తించిన రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పెట్టుబడిదారులు ఈ విభాగంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. కొలియర్స్ ఇండియా నివేదిక ప్రకారం, 2025 నుంచి ఇప్పటివరకు ఈ రంగంలో రూ.13,000 కోట్లకు పైగా పెట్టుబడుల నిబద్ధతలు ప్రకటించబడ్డాయి.రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఈ పెట్టుబడులను వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంది. కొత్త నివాస సముదాయాల నిర్మాణంతో పాటు వైద్య సేవల సంస్థలు, సీనియర్ కేర్ ఆపరేటర్లు, నిర్వహణ సంస్థల భాగస్వామ్యానికి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు సాధారణ నివాస ప్రాజెక్టులపై దృష్టి సారించిన నిర్మాణ సంస్థలకు సీనియర్ లివింగ్ ఒక ప్రత్యేక వ్యాపార విభాగంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణ, వైద్య సేవలు, నివాస సౌకర్యాలను సమన్వయం చేయగల సంస్థలకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉండనున్నాయి.

బెంగళూరు ముందంజ.. హైదరాబాద్, పూణేలకు పెరుగుతున్న ప్రాధాన్యత!

సీనియర్ లివింగ్ మార్కెట్‌లో బెంగళూరు ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. మెరుగైన వైద్య మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందిన నివాస ప్రాంతాలు, ప్రత్యేక సీనియర్ హౌసింగ్ ప్రాజెక్టులు ఈ నగరానికి అనుకూలంగా ఉన్నాయి.పూణేలోనూ వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నివాస సముదాయాలపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో వైద్య సదుపాయాలు, నివాస మార్కెట్ విస్తరణ, కనెక్టివిటీ ఈ రంగానికి అదనపు అవకాశాలను అందిస్తున్నాయి.ఈ మూడు నగరాలతో పాటు చెన్నై కూడా సీనియర్ లివింగ్ మార్కెట్‌లో కీలక కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. భవిష్యత్తులో నగరాలవారీగా డిమాండ్, కొనుగోలు శక్తి, వైద్య సదుపాయాలు, జీవన వ్యయాన్ని బట్టి ఈ ప్రాజెక్టుల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది.

మెట్రో నగరాలకే పరిమితం కాదు.. చిన్న నగరాలకూ విస్తరణ!

సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి ఇప్పుడు ప్రధాన నగరాల పరిధిని దాటి టైర్-2, టైర్-3 నగరాల వైపు విస్తరిస్తోంది. కోయంబత్తూరు, మైసూరు, వడోదర, నాసిక్, కొచ్చి వంటి నగరాలతో పాటు తిరుపతి, హరిద్వార్, వారణాసి, అయోధ్య వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఈ రంగంలో కొత్త అవకాశాలను అందిస్తున్నాయి.తక్కువ జీవన వ్యయం, అందుబాటులో ఉండే భూమి, ప్రశాంతమైన వాతావరణం, మెరుగుపడుతున్న వైద్య సదుపాయాలు ఈ నగరాలను సీనియర్ లివింగ్ ప్రాజెక్టులకు అనుకూలంగా మారుస్తున్నాయి. కొలియర్స్ అంచనా ప్రకారం, రాబోయే కొత్త ప్రాజెక్టుల్లో సుమారు 30 నుంచి 40 శాతం వరకు టైర్-2, టైర్-3 నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

డెవలపర్లకు కొత్త వ్యాపార నమూనా.. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక అవకాశం!

సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు సాధారణ గృహ నిర్మాణానికి భిన్నమైన వ్యాపార నమూనాను కలిగి ఉంటాయి. ఇక్కడ కేవలం స్థలం, నిర్మాణ నాణ్యత, చదరపు అడుగుల ధర మాత్రమే కాకుండా నిర్వహణ సామర్థ్యం, వైద్య సేవల నాణ్యత, భద్రత, నివాసితుల అవసరాలకు అనుగుణంగా అందించే సేవలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.ఈ రంగంలో విజయవంతం కావాలంటే నిర్మాణ సంస్థలు విశ్వసనీయ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ప్రత్యేక నిర్వహణ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలి. స్వతంత్రంగా జీవించగల వృద్ధుల కోసం ఇండిపెండెంట్ లివింగ్, రోజువారీ పనులకు సహాయం అవసరమైన వారికి అసిస్టెడ్ లివింగ్ వంటి విభిన్న నమూనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.అదే సమయంలో గృహాల ధరలు, నిర్వహణ ఛార్జీలు, వైద్య సేవల ఖర్చులు, ఒప్పంద నిబంధనలు పారదర్శకంగా ఉండాలి. వృద్ధుల జీవితకాల పొదుపులు ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా మారే అవకాశం ఉన్నందున కొనుగోలుదారుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor