48 గంటల్లో కీలక నిర్ణయం

ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్‌కు భూమి కేటాయిస్తాం

పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు, పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనుమతుల్లో జాప్యం లేకుండా త్వరలోనే సమగ్ర పాలసీని రూపొందించి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు ఎదురవుతున్న అనుమతులు, భూమి మార్పిడి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు తగిన ప్రతిపాదనలతో ముందుకొస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026ను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో దేశీయ, విదేశీ సంస్థలు పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు, ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించాలనుకునే వారికి వివిధ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్న తరహాలోనే, ఈ విధానాన్ని త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనవసరమైన జాప్యం లేకుండా సమగ్ర విధానాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్‌కు అవకాశం

డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026ను పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. పరిశ్రమ అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు సమర్పిస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.పౌల్ట్రీ పరిశ్రమకు కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఒడిదుడుకులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో కోళ్ల దాణా తయారీకి అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్ వంటి ముడి సరుకుల విషయంలో ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాల నిల్వలు, పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న బఫర్ స్టాక్‌ను పరిశీలిస్తామని తెలిపారు.మొక్కజొన్న, సోయాబీన్‌లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడంతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయి? ఏ ధరకు సరఫరా చేయవచ్చు? ఏ విధంగా పరిశ్రమకు మద్దతు అందించవచ్చు? అనే అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షించి 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని వేదికపైనే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి సూచించారు.

రైతులకు అండగా.. యువతకు ప్రొటీన్ అందిస్తున్న పరిశ్రమ

పౌల్ట్రీ పరిశ్రమ కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు, రైతు కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు చేస్తోందని సీఎం అన్నారు. రైతులు పండించే మొక్కజొన్న, సోయాబీన్‌తో పాటు నూకలు, తౌడు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులను పౌల్ట్రీ రంగం కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మార్కెట్‌ను కల్పిస్తోందని పేర్కొన్నారు.గుడ్లు, చికెన్ ఉత్పత్తి ద్వారా ప్రజలకు పోషకాహారం అందించడంతో పాటు రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణలో ప్రతిరోజూ సుమారు 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, తద్వారా యువతకు అవసరమైన ప్రొటీన్ అందించడంలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు, చికెన్‌తో కూడిన భోజనం అందించడంలో కూడా పౌల్ట్రీ పరిశ్రమ సహకారం ఉపయోగపడుతోందని చెప్పారు.ఐటీ, ఫార్మా, డిఫెన్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లతో పాటు పౌల్ట్రీ పరిశ్రమను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన రంగంగా గుర్తిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిరంతరం పనిచేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో 18 సంవత్సరాలుగా పౌల్ట్రీ, మీట్ ఎక్స్‌పో నిర్వహించడం, ఈ రంగంలో రాష్ట్రం సాధించిన ఉత్పత్తి సామర్థ్యం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు.తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అమలైన మంచి పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూనే వాటిని మరింత మెరుగుపరుస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారే పరిస్థితి పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని కలిగిస్తుందని, తెలంగాణలో మాత్రం పెట్టుబడులకు భరోసా కల్పించే విధంగా పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యందేశ జనాభాలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతమే అయినప్పటికీ, దేశ జీడీపీలో రాష్ట్రం 5 శాతం వాటాను కలిగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వాటాను 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే పారిశ్రామిక రంగానికి మరింత ప్రోత్సాహం అవసరమని, పౌల్ట్రీ పరిశ్రమతో పాటు అన్ని రంగాల పెట్టుబడిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై పరిశ్రమ వర్గాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ పరిశ్రమల విస్తరణకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, IPEMA అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్‌తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు, జాతీయ, అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor