శివనామస్మరణతో మార్మోగిన వనస్థలిపురం.. కవులు, రచయితల సమక్షంలో వైభవంగా వేడుకలు

ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక ఆనందం.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వనభోజనాలు

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనస్థలిపురంలోని జింకల పార్కులో కార్తీక మాస వనభోజన కార్యక్రమం వైభవంగా జరిగింది. నక్క వెంకటమ్మ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మికత, సాహిత్య పరిమళం, ఆత్మీయతల కలయికగా సందడిగా సాగాయి. పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవులు, రచయితలు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివనామస్మరణ, భక్తి గీతాలతో పార్కు ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ కవులు, రచయితలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడుపుతూ వనభోజనాల సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి మాట్లాడుతూ.. కార్తీక మాస వనభోజనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. నిత్య జీవితంలో వివిధ పనులతో బిజీగా ఉండే ప్రజలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సమయం గడపడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, కాలుష్యానికి దూరంగా ప్రకృతితో మమేకం కావడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు. ఇలాంటి వేడుకలు సమాజంలో స్నేహభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

సందర్భంగా పాల్గొన్న కవులు, విమర్శకులు మాట్లాడుతూ.. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర మాసమని, హరిహరుల ఏకత్వాన్ని చాటిచెప్పే ఆధ్యాత్మిక విశిష్టత దీనికి ఉందని వివరించారు. కార్తీక మాసంలో తులసి, ఉసిరి చెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఇవి ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, చెట్లను సంరక్షించడంతో పాటు నీటి వనరులను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఆటపాటలు, సహపంక్తి భోజనాలతో సందడిఅనంతరం నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహితీ అభిమానులు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. భోజనాల అనంతరం ఆటపాటలు, సరదా ప్రశ్నలు, కేరింతలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. సాహితీ మిత్రుల ఆత్మీయ పలకరింపులు, నవ్వులు, ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ఉల్లాసంగా కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాస్ యాదవ్, రాధాకుసుమ, పాలడుగు సరోజినీ దేవి, గంట మనోహర్ రెడ్డి, పి. శంకరయ్య, బాపని యాదగిరి, డాక్టర్ గజవల్లి సత్యనారాయణ, ఉలఖండ ఉపేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పి. బడే సాబ్ సమర్థవంతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, సాహితీ అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor