రూ.600 కోట్ల ఆదాయమే లక్ష్యం.. మోకిలా, షాబాద్, తుర్కయాంజల్‌లో ప్లాట్ల విక్రయానికి రంగం సిద్ధం

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హైదరాబాద్ మహానగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, అభివృద్ధి చేసిన ప్లాట్ల విక్రయం ద్వారా భారీ ఆదాయాన్ని సమీకరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో విడత వేలం ప్రక్రియకు సిద్ధమైంది. వివిధ ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.600 కోట్ల ఆదాయాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విడతలో ఖానామెట్, మోకిలా, షాబాద్, తుర్కయాంజల్, కిష్టారెడ్డిపేట తదితర ప్రాంతాల్లోని భూములు, ప్లాట్లను విక్రయించనున్నారు. ఖానామెట్‌లో 0.21 ఎకరాలు, 1.39 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు భూఖండాలు వేలం జాబితాలో ఉన్నాయి. మోకిలాలో 300 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో 61 ప్లాట్లు, షాబాద్‌లో 300 చదరపు గజాల చొప్పున 35 ప్లాట్లు విక్రయానికి ఉంచారు.

తుర్కయాంజల్‌లో 600 నుంచి 1,146 చదరపు గజాల విస్తీర్ణంలో 11 ప్లాట్లతో పాటు కిష్టారెడ్డిపేటలో 1,452 చదరపు గజాల స్థలం కూడా వేలం ప్రక్రియలో భాగంగా ఉంది.ప్రాంతాల వారీగా కనీస ధరలను కూడా నిర్ణయించారు. ఖానామెట్‌లో ఎకరానికి రూ.99 కోట్లు, మోకిలాలో చదరపు గజానికి రూ.55 వేలు, తుర్కయాంజల్‌లో రూ.50 వేలు, షాబాద్‌లో రూ.25 వేలుగా కనీస ధరలను నిర్ణయించినట్లు ప్రకటించారు.డిసెంబర్ 14 నుంచి 21 వరకు ఆన్‌లైన్ వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ఆసక్తి గల బిడ్డర్లు నిర్దేశిత గడువులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.హైదరాబాద్ నగర విస్తరణతో శివారు ప్రాంతాల్లో నివాస, వాణిజ్య అవసరాలకు భూములపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో HMDA వేలం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మోకిలా, తుర్కయాంజల్, షాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ప్లాట్ల విక్రయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor