మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, పీఆర్‌టీఎస్‌కు వేగం.. 2027 జనవరిలో మూసీ ఫేజ్‌-1 పనులు ప్రారంభం

మల్టీ లెవెల్ పార్కింగ్‌లు, ఆధునిక గోశాల, ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు ప్రాధాన్యం

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు క్యూర్, ప్యూర్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS), చెరువుల పునరుద్ధరణ, మార్కెట్ల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించి, నిర్దిష్ట గడువుల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు.

మూసీ ప్రాజెక్టుకు జనవరి 2027 లక్ష్యం

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్‌-1 పనులను 2027 జనవరిలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఫేజ్‌-1లో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్‌-1ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్‌-1బీగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలులో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

రేడియల్ రోడ్లకు భూసేకరణ వేగవంతం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, నగర విస్తరణకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పీఆర్‌టీఎస్‌తో కొత్త రవాణా వ్యవస్థ

హైదరాబాద్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఫేజ్‌-1 ఏర్పాటుకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనంపై అధికారులు వివరించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు ప్రతిపాదించిన మార్గం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అలాగే బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు మరో మార్గాన్ని ప్రతిపాదించారు.

నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. డిపోల పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రూట్లు, డిపోల నిర్మాణం తదితర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం అనంతరం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

మీరాలం చెరువు అభివృద్ధికి గడువు

మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. 2028 జనవరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో పాటు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని సీఎం ఆదేశించారు.

కోహెడ ఫ్రూట్ మార్కెట్‌కు మెరుగైన రహదారులు

కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. మార్కెట్ నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, రైతులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన రవాణా సౌకర్యాల కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఐఐఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేలా పలు సూచనలు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

చెరువులు, మెట్ల బావుల పునరుద్ధరణకు ప్రాధాన్యం

క్యూర్ పరిధిలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPలు) ఏర్పాటు చేసే ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. నగరంలోని చారిత్రక మెట్ల బావుల పునరుద్ధరణకు కూడా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, హెచ్‌ఎండీఏ, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఎఫ్‌సీడీఏ కమిషనర్లు, హెచ్‌ఎంవీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ, ఎంఆర్‌డీసీఎల్, హెచ్‌జీసీఎల్ ఎండీలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor