గత పాలకులు, ప్రస్తుత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే డిపోకు దూరమయ్యామంటున్న స్థానికులు.. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ చూపాలని డిమాండ్
ప్రాపర్టీ వాయిస్ : మోత్కూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. మోత్కూరుతో పాటు అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు మండలాల ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిపో సాధనకు అఖిలపక్ష నాయకులు నడుం బిగించారు. ఎర్రవెల్లి నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిపో ఏర్పాటుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుమోత్కూరు పరిసర ప్రాంతాల ప్రజలు విద్య, వైద్యం, వ్యాపారం, ఇతర అవసరాల కోసం భువనగిరి, బీబీనగర్‌లోని ఎయిమ్స్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతాలకు తొర్రూరు, సూర్యాపేట, యాదగిరిగుట్ట డిపోల నుంచి బస్సులు నడుస్తున్నప్పటికీ, తిరుమలగిరి వైపు నుంచి వచ్చే బస్సులు ఇప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసి వస్తుండటంతో మోత్కూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ తీసుకున్నా బస్సుల్లో నిలబడటానికి కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణం మరింత కష్టతరంగా మారుతోందని తెలిపారు.ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే మోత్కూరు మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయడం అత్యవసరమని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు.ప్రజావాణిలో వినతిపత్రంఆర్టీసీ డిపో ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ ఉద్యమానికి అఖిలపక్ష కమిటీ ముందుండి పోరాడాలని తీర్మానించారు.ఇందులో భాగంగా మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతానికి ఆర్టీసీ డిపో అత్యవసరమని గుర్తించిన నోడల్ అధికారి, డిపో ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేస్తూ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమా?మోత్కూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు కాకపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెండుసార్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా డిపో ఏర్పాటులో ఆశించిన పురోగతి లేదని విమర్శిస్తున్నారు. ప్రజల రవాణా అవసరాలను పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రాంతానికి డిపో దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని, ఎంపీ, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మోత్కూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అఖిలపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల రవాణా కష్టాలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, అవిశెట్టి ఐలుమల్లు, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, లెంకల వేణు, మెంట నాగేష్, సోమిరెడ్డి, బయ్యని రాజు, వినియోగదారుల సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పోచం సోమయ్య, జంగా శ్రీను, చౌగోని సత్యం, పొన్నెబోయిన రమేష్, పులకర మల్లేష్, లక్ష్మీనర్సయ్య, బొల్లు యాదగిరి, తీపిరెడ్డి సోమిరెడ్డి, సజ్జనం మనోహర్, డాక్టర్ రఘువర్ధన్, రిటైర్డ్ ఎమ్మార్వో దేవపాలన్, బ్రహ్మచారి , రిటైర్డ్ ఉపాధ్యాయులు మనోహరాచారి, గట్టు వెంకటేశ్వర్లు, కలమల నర్సయ్య, ఎడ్ల నరేష్, గజ్జెల్లి మహేష్, కురిమేటి సైదులు, విలేకరులు జహంగీర్, దబ్బేటి సోంబాబు, బుర్ర శ్రీను, సైమాన్, కూరెల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
