నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో–2026ను సందర్శించిన తెలంగాణ రెరా చైర్మన్ కే.ఎస్. శ్రీనివాస రాజు

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

గృహ కొనుగోలుదారులు ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ఆయా ప్రాజెక్టులు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని తెలంగాణ రెరా చైర్మన్ కే.ఎస్. శ్రీనివాస రాజు సూచించారు. రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, ప్రాజెక్టు వివరాలు, రిజిస్ట్రేషన్ స్థితిని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో–2026’ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన వివిధ రెరా నమోదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల స్టాళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత, జవాబుదారీతనంతో అభివృద్ధి చెందేందుకు తెలంగాణ రెరా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకాన్ని పెంపొందించడం రెరా లక్ష్యమని పేర్కొన్నారు.

కొనుగోలుదారులకు రెరాపై అవగాహన

ప్రాపర్టీ షోలో తెలంగాణ రెరా ప్రత్యేక అవగాహన స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్ ద్వారా గృహ కొనుగోలుదారులకు రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేయడం వల్ల కలిగే చట్టపరమైన, ఆర్థికపరమైన, నియంత్రణపరమైన రక్షణలపై అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే, రెరా రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత, కొనుగోలుదారులకు చట్టం కల్పిస్తున్న రక్షణలు, ప్రాజెక్టుల వివరాలను ఎలా పరిశీలించాలనే అంశాలను సందర్శకులకు వివరిస్తున్నారు.

నమోదిత ప్రాజెక్టులనే ఎంచుకోవాలి

ఫ్లాట్ లేదా ప్లాట్ కొనుగోలు చేసే ముందు సంబంధిత ప్రాజెక్టు తెలంగాణ రెరాలో నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు కొనుగోలుదారులకు సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించకుండా తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దని, మోసాలు, ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందేందుకు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

గృహ కొనుగోలుదారులకు నమ్మకమైన సమాచారం అందించడంతో పాటు రెరా నిబంధనలపై అవగాహన పెంపొందించడంలో నారెడ్కో ప్రాపర్టీ షో–2026 వేదికగా నిలుస్తోంది.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor