ఘనంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో

75 మంది డెవలపర్లు.. 5 ఆర్థిక సంస్థలు.. 10 అనుబంధ సంస్థల భాగస్వామ్యం

2030 నాటికి దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా 13 శాతానికి చేరుతుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసం.. ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందించడమే లక్ష్యం కావాలి

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హైదరాబాద్ వేదికగా రియల్ ఎస్టేట్ రంగం తన సత్తా చాటింది. వేలాది మంది గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల ఆసక్తి మధ్య నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో – 2026 విజయవంతంగా ముగిసింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ మెగా ప్రాపర్టీ ప్రదర్శనలో 500కు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకర్షించాయి. దేశ రియల్ ఎస్టేట్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి వివరించగా, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొప్పుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

500 ప్రాజెక్టులు.. ఒకే వేదికపై రియల్ ఎస్టేట్ వైభవం!

ఈ ప్రాపర్టీ షోలో 75 మంది డెవలపర్లు, బిల్డర్లు, 5 ఆర్థిక సంస్థలు, 10 అనుబంధ రంగ సంస్థలు పాల్గొన్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య ఆస్తులు సహా వివిధ విభాగాలకు చెందిన 500కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. వివిధ బడ్జెట్లకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్రాపర్టీలను ఒకే వేదికపై పరిశీలించే అవకాశం కొనుగోలుదారులకు లభించింది.

భారత్ రియల్ ఎస్టేట్‌కు అంతర్జాతీయ గుర్తింపు: కిషన్ రెడ్డి

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్‌పరెన్సీ ఇండెక్స్‌లో భారత్ టాప్ 30 దేశాల్లో స్థానం సంపాదించిందని తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత మెరుగైన పురోగతి సాధించిన మార్కెట్‌గా భారత్ నిలిచిందన్నారు.

ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 7 శాతంగా ఉందని, 2030 నాటికి అది 13 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందుబాటులో ఉండాలని, రియల్ ఎస్టేట్‌ను కేవలం భూములు, భవనాలు, లావాదేవీల వ్యాపారంగా కాకుండా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా చూడాలని డెవలపర్లకు సూచించారు.

18 శాతం జీఎస్టీ తగ్గించాలి.. నిర్మాణ రంగానికి ఊరట కల్పించాలి!

నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అయితే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో డెవలపర్లు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాణిజ్య, అద్దె ఆస్తులపై 18 శాతం జీఎస్టీ విధించడం పరిశ్రమకు భారంగా మారుతోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని కోరారు. 2047 నాటికి దేశం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనలో రియల్ ఎస్టేట్ రంగం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలో నిలిచిపోకుండా డెవలపర్లకు తగిన సమయం కల్పించాలని, రేరా పొడిగింపులు, నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విధానపరమైన చిన్న మార్పులు కూడా పరిశ్రమ వృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారధిగా ప్రాపర్టీ షో

మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ ప్రాపర్టీ విభాగాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. మార్కెట్‌లో మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులు, పెట్టుబడి అవకాశాలు, రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడింది. డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష సంప్రదింపులకు ఈ ప్రదర్శన మంచి వేదికగా నిలిచింది.

350 మందికి పైగా డెవలపర్లకు ప్రాతినిధ్యం

31 సంవత్సరాల చరిత్ర కలిగిన నారెడ్కో తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి కృషి చేస్తోంది. 350 మందికి పైగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఆరు అనుబంధ సంస్థలతో కలిసి ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య వారధిగా వ్యవహరిస్తోంది. పరిశ్రమకు అనుకూలమైన విధానాల రూపకల్పన, ఆధునిక సాంకేతికత వినియోగం, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరణకు కృషి చేస్తోంది.

మొత్తంగా.. నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో విజయవంతంగా ముగియడం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు, డెవలపర్లు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయానికి మరో కీలక వేదికగా నిలిచింది.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor