Oplus_19005440

రెండో రోజు హైటెక్స్‌లో సందడి.. వివిధ ప్రాజెక్టులపై సందర్శకుల ఆసక్తి

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాజెక్టులను పరిశీలించిన గృహ కొనుగోలుదారులు

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నరెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16వ ప్రాపర్టీ షో రెండో రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులు, ఆకర్షణీయమైన ప్రదర్శన స్టాళ్లు, సందర్శకుల రాకతో ప్రాపర్టీ షో సందడిగా మారింది.

రెండో రోజు పలువురు గృహ కొనుగోలుదారులు, కుటుంబ సభ్యులు ప్రాపర్టీ షోను సందర్శించి తమకు అనువైన నివాస ప్రాజెక్టుల వివరాలను తెలుసుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వివిధ నివాస ప్రాజెక్టులకు సంబంధించిన నమూనాలు, బ్రోచర్లు, ప్రాజెక్టుల ప్రత్యేకతలను ప్రతినిధులు సందర్శకులకు వివరించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నివాస ప్రాజెక్టులు, ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాజెక్టులను పోల్చి చూసుకుంటూ సంస్థల ప్రతినిధులతో నేరుగా చర్చించడం ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకతగా నిలిచింది.

ఒకే వేదికపై పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులను పరిశీలించే అవకాశం లభించడంతో గృహ కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ ప్రదర్శన మంచి వేదికగా నిలుస్తోంది. తెలంగాణ నిర్వహిస్తున్న ఈ 16వ ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగంలోని సంస్థలకు తమ ప్రాజెక్టులను పరిచయం చేసుకునేందుకు, కొనుగోలుదారులకు సరైన సమాచారం అందించేందుకు వారధిగా నిలుస్తూ రెండో రోజు విజయవంతంగా కొనసాగింది.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor