సురభి ఎస్టేట్స్‌కు టీజీ రెరా షాక్.. బాధితుడికి రూ.1.50 లక్షల పరిహారం

60 రోజుల్లో చెల్లించాలని ఆదేశం.. గడువు దాటితే 10 శాతం వడ్డీ

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

విల్లా కొనుగోలు వ్యవహారంలో తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడంలో జాప్యం చేయడంతో పాటు, జారీ చేసిన చెక్కులు బౌన్స్ కావడంపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సురభి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఈ. శ్రీనివాస్ బాధితుడు అల్లంనేని మోని చంద్రకు రూ.1.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు టీజీ రెరా అడ్జుడికేటింగ్ అధికారి ఎం. రాజమౌళి శర్మ 2026 అక్టోబర్ 15న ఉత్తర్వులు వెలువరించారు.

వివరాల్లోకి వెళితే.. ఓస్మాన్ నగర్‌లోని సురభి సిగ్నేచర్ విల్లాస్ ప్రాజెక్టులో ఫేజ్-1లో విల్లా నంబర్ 20 కొనుగోలు చేసేందుకు ఫిర్యాదుదారుడు 2020 జనవరి 6న సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విల్లా కొనుగోలు ధర రూ.1.30 కోట్లు కాగా, అందులో భాగంగా రూ.కోటి చెల్లించారు. అనంతరం ఫేజ్-2లో పెద్ద విల్లా కేటాయిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో కేటాయింపును మార్చినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరగడంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో ఫిర్యాదుదారుడికి ఇప్పటికే చెల్లించిన రూ.కోటితో పాటు అదనంగా రూ.69 లక్షలు కలిపి మొత్తం రూ.1.69 కోట్లు తిరిగి చెల్లించేందుకు సంస్థ అంగీకరించింది. ఇందుకోసం 2023 జనవరి 4న ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

అయితే సంస్థ జారీ చేసిన పలు చెక్కులు బ్యాంకులో తగినంత నగదు లేకపోవడంతో బౌన్స్ అయ్యాయి. అనంతరం కొత్త చెక్కులు ఇచ్చినప్పటికీ చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో బాధితుడు తనకు జరిగిన మానసిక వేదన, ఇతర ఖర్చులకు పరిహారం కోరుతూ టీజీ రెరాను ఆశ్రయించారు.

ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన అడ్జుడికేటింగ్ అధికారి.. ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులో సొమ్ము చెల్లించకపోవడం, పలుమార్లు చెక్కులు బౌన్స్ కావడం వల్ల ఫిర్యాదుదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో మానసిక వేదనకు రూ.లక్ష, ఇతర ఖర్చులకు రూ.30 వేలు, న్యాయవాది ఫీజు కింద రూ.20 వేలు కలిపి మొత్తం రూ.1.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని, లేనిపక్షంలో చెల్లించాల్సిన మొత్తంపై ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా చెల్లించాలని టీజీ రెరా స్పష్టం చేసింది.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor