సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా.. ఏడుగురు బిల్డర్లకు కీలక ఆదేశాలు
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, ఇంటి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కీలక చర్యలు చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణ సంస్థలపై జరిమానాలు విధించడంతో పాటు, నిర్మాణాల్లో జాప్యం, అనుమతుల లోపాలు, ఫ్లాట్లు, ప్లాట్ల అప్పగింతలో నిర్లక్ష్యం వహించిన సంస్థలకు కొనుగోలుదారుల సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా
మంచిరేవులలోని రిజిస్ట్రేషన్ లేని ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టుపై TG RERA కఠిన చర్యలు తీసుకుంది. రెరా చట్టం-2016లోని సెక్షన్లు 3, 4 నిబంధనలను ఉల్లంఘించినందుకు సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ పొందే వరకు ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్‌లు, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కొనుగోలుదారులకు సొమ్ము వాపసు చేయాలని ఆదేశాలు
నిర్మాణాల్లో జాప్యం, ఒప్పందాల అమలులో వైఫల్యాలపై పలువురు బిల్డర్లకు రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది.
శ్రీ ఆదిత్య స్క్వేర్స్: కొనుగోలుదారుకు రూ.17 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
త్రిపుర కన్‌స్ట్రక్షన్స్: అవసరమైన అనుమతులు పొందకపోవడం, నిర్మాణం ప్రారంభించకపోవడంతో రూ.41.85 లక్షలను వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.
వాసవి రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ: కొనుగోలుదారు చెల్లించిన రూ.49.50 లక్షలపై 2025 ఫిబ్రవరి 7 నుంచి ఫ్లాట్‌ను అప్పగించే వరకు ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్: అవసరమైన హెచ్‌ఎండీఏ అనుమతులు పొందకపోవడం, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో రూ.27.16 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్: ప్లాట్ రిజిస్ట్రేషన్, స్వాధీనం అప్పగింతలో విఫలమైనందుకు రూ.7 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
భువంతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: ప్రాజెక్టును నిలిపివేసి, కొనుగోలుదారులకు ఫ్లాట్లు అప్పగించకపోవడంతో రూ.26 లక్షలను వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.
మియాపూర్‌లో ఫ్లాట్ అప్పగింతకు ఆదేశం
మియాపూర్‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను కొనుగోలుదారుకు తక్షణమే అప్పగించాలని అరైన్ ఇన్‌ఫ్రా సంస్థను TG RERA ఆదేశించింది. కొనుగోలుదారు రూ.6.58 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ సంస్థ చేసిన వాదనను రెరా తిరస్కరించింది. విక్రయ ఒప్పందం, రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లో ఆ బకాయిలకు సంబంధించిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని జరిమానాలు
రెరా జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే 2016 రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం అదనపు జరిమానాలు విధిస్తామని సంబంధిత నిర్మాణ సంస్థలను అథారిటీ హెచ్చరించింది.
కొనుగోలుదారులకు భరోసా.. బిల్డర్లకు హెచ్చరిక!
తాజా ఆదేశాలు రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయ కార్యకలాపాలు నిర్వహించడం, కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఒప్పందాలను అమలు చేయకపోవడం వంటి అంశాలను రెరా తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు, ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే ముందు ప్రాజెక్టు అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్, ఒప్పంద పత్రాలను పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.




