• 21 కి.మీ. తొలి విడత పనులకు త్వరలో టెండర్లు.. అన్ని అనుమతులు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి
  • తుమ్మిడికుంట అభివృద్ధికి నాగార్జున రెండు ఎకరాల భూమి విరాళం
  • 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు చెరువు విస్తరణ
  • చెరువులు, రివర్ ఫ్రంట్ అభివృద్ధితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త అవకాశాలు

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హైదరాబాద్ నగర భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నగర పర్యావరణంతో పాటు నది పరివాహక ప్రాంతాల పట్టణాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. మాదాపూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన తుమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ నగర భవిష్యత్తు అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున రెండు ఎకరాల భూమి.. 14 నుంచి 30 ఎకరాలకు తుమ్మిడికుంట

తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణలో సినీనటుడు అక్కినేని నాగార్జున కీలకంగా సహకరించారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకప్పుడు 14 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును పునరుద్ధరణ చర్యలతో 30 ఎకరాలకు విస్తరించామని తెలిపారు. ఈ అభివృద్ధి కోసం నాగార్జున రెండు ఎకరాల భూమిని అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ నాగార్జున హీరోగా నిలిచారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే వారిని ప్రభుత్వం గౌరవిస్తుందని, అందులో భాగంగానే నాగార్జునను శాలువాతో సత్కరించినట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో 1,372 చెరువులు.. సగానికి పైగా కనుమరుగు

హైదరాబాద్ నగరానికి చెరువులు, సరస్సులు, సహజమైన రాతి నిర్మాణాలు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో సగానికి పైగా కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలు, నగర విస్తరణ, ప్రభుత్వాల నిర్లక్ష్యం తదితర కారణాలతో అనేక జలవనరులు ఉనికిని కోల్పోయాయని చెప్పారు.చెరువులు ఉండాల్సిన ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల వర్షాకాలంలో రహదారులు జలమయమవుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమవుతున్నాయని వివరించారు. నగరంలో తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు సహా దాదాపు 20 చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

మూసీ ప్రక్షాళనతో రియల్ ఎస్టేట్‌కు కొత్త అవకాశాలు

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. నది పరివాహక ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు మెరుగుపడటం, రహదారులు, పార్కులు, ప్రజా వినియోగ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం ద్వారా ఆయా ప్రాంతాల నివాస, వాణిజ్య ప్రాధాన్యత పెరిగే అవకాశముంది.ప్రపంచంలోని అనేక నగరాల్లో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పట్టణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చింది. గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ ఇందుకు ఒక ఉదాహరణ. ఇదే తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే పర్యాటకం, ఆతిథ్య రంగం, వాణిజ్య సముదాయాలు, సేవారంగ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడవచ్చు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి కేంద్రాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

లేక్ ఫ్రంట్ అభివృద్ధితో నివాస ప్రాంతాలకు ప్రాధాన్యత

తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ నగరంలోని ఇతర చెరువుల అభివృద్ధికి ఒక నమూనాగా నిలవవచ్చు. చెరువుల చుట్టూ పచ్చదనం, వాకింగ్ ట్రాక్స్, ప్రజలకు అందుబాటులో ఉండే పార్కులు, మెరుగైన పరిసరాలు ఏర్పడితే ఆ ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులకు అదనపు ఆకర్షణ లభిస్తుంది. లేక్ వ్యూ, గ్రీన్ లివింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది.అయితే నది, చెరువుల పరిసరాల్లో భూముల విలువలు, నిర్మాణ అనుమతులు, భూవినియోగ పరిమితులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలు కీలకం కానున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారులు సంబంధిత ప్రభుత్వ నిబంధనలను పరిశీలించడం అవసరం.

తుమ్మిడికుంటతో లేక్ ఎకానమీకి శ్రీకారం

పునరుద్ధరించిన తుమ్మిడికుంట చెరువు నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళలు చెరువు నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు. మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి చిన్నచిన్న వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని తెలిపారు.చెరువు ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా తీర్చిదిద్దాలని, నగర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళన అందరి బాధ్యత

మూసీ నదిలో మురుగునీరు, వ్యర్థాలు, ఇతర కాలుష్య పదార్థాలు చేరడంతో నది మురికికూపంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన కేవలం సుందరీకరణ కాదని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల ప్రయోజనాలతో ముడిపడిన కార్యక్రమమని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు వల్ల ఎవరైనా నష్టపోయే పరిస్థితి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.

పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor