హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను పరిశీలించిన ఎండీ అశోక్‌రెడ్డి
సింగూరు, మంజీరా జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు.. ప్రత్యామ్నాయ నీటి సరఫరా మార్గాలపై కసరత్తు
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్
రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలపై జలమండలి అప్రమత్తమైంది. వేసవిలో నీటి డిమాండ్ పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేస్తూ ప్రత్యామ్నాయ జల వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో నగరానికి నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి గండిపేటలో పర్యటించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోయే వేసవిలో నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జలాశయాల నుంచి అదనంగా నీటిని సేకరించి సరఫరా చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున ఇప్పటి నుంచే అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఎండీ సూచించారు. జంట జలాశయాల నుంచి అదనంగా ఎంతమేర నీటిని సేకరించవచ్చనే అంశంపై సమగ్రంగా పరిశీలించాలని, అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో అదనపు నీటి సరఫరా మార్గాలను అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక సామర్థ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జలాశయాల్లో నీటి లభ్యత, నీటి తరలింపు సామర్థ్యం, అదనపు సరఫరాకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు.నగరానికి అందుబాటులో ఉన్న ప్రతి జల వనరును సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జంట జలాశయాల పరిశీలనతో పాటు అధికారుల నుంచి సేకరించే సాంకేతిక వివరాలు, నీటి లభ్యత నివేదికల ఆధారంగా తదుపరి కార్యాచరణను జలమండలి రూపొందించనుంది. వేసవి అవసరాలను ముందుగానే అంచనా వేస్తూ ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి సారించడం ద్వారా నగర తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది.





