ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలను పరిచయం చేసే లక్ష్యంతో నరెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 1 వరకు హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది.ఈ షోలో నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, రిటైల్‌ ప్రాజెక్టులు, ప్లాటెడ్‌ డెవలప్‌మెంట్లకు సంబంధించిన పలు రకాల రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. వివిధ బడ్జెట్లకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు సందర్శకులకు ఇది ఉపయోగపడనుంది.

బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, రూ.10 లక్షల విలువైన ప్లాట్ల నుంచి రూ.10 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాల వరకు వివిధ ధరల శ్రేణుల్లో ఆస్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

2010లో 40 స్టాళ్లతో ప్రారంభమైన ప్రాపర్టీ షో ప్రస్తుతం 80 స్టాళ్ల స్థాయికి విస్తరించిందని ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కాళీప్రసాద్‌ వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ప్రస్తుతం సానుకూలంగా ఉందని మరో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కె. గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కోశాధికారి కొండల సుధాకర్‌రెడ్డితో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor